విళ్లివాకం న్యూస్: తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో 'ఉగాది స్వర్ణోత్సవ సంబరాలు' గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి.
పెరంబూరు డిఆర్ బిసిసి మహోన్నత పాఠశాల ముక్కాల నమ్మాళ్వార్ శ్రేష్టి ఆడిటోరియం వేదికయింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా చెన్నై అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ఆచార్య సీఎం కే రెడ్డి విచ్చేశారు. విశిష్ట అతిథిగా ప్రముఖ చలనచిత్ర నటులు భానుచందర్ విచ్చేశారు. అలాగే ఆత్మీయ అతిథిగా చెన్నై జనని వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య విచ్చేశారు. ముందుగా తమ్మినేని బాబు స్వాగతోపన్యాసం చేశారు.
ముఖ్య అతిధి సీఎం కే రెడ్డి మాట్లాడుతూ మహాకవి భారతీయార్ మన తెలుగును సుందరమైన తెలుగని ప్రశంసించారని అన్నారు. ఈ సంస్థ 50 ఏళ్లు నిరాటంకంగా సాగిందని, 100 ఏళ్ళు పూర్తి చేసుకోవాలని అభిలషించారు. ప్రపంచమంతా భారత సంస్కృతిని చూసి మెచ్చుకుంటున్నట్లు తెలిపారు. భానుచందర్ మాట్లాడుతూ మీ అందరినీ కలవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషను సి.పి.బ్రౌన్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రశంసించినట్లు తెలిపారు. గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తెలుగు సంస్థలు చాలా ఉన్నప్పటికీ ఈ సంస్థ మాత్రమే 50 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు, సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఇందులో పి.సుబ్బారెడ్డి, ఆచార్య విస్తాలి శంకరరావు, శ్రీ లక్ష్మీ మోహన్ రావు, ఎం.ఆర్. సుబ్రమణ్యం అవార్డులు అందుకున్నారు. పంచాంగ పఠనం పెద్దోజు నరేష్ నిర్వహించారు. షీలా ఉన్నికృష్ణన్ బృందం భరతనాట్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో 50 మంది విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ముందుగా గణేశ స్తుతి ప్రార్థనా గీతాన్ని ఎం ఆర్ సుబ్రహ్మణ్యం ఆలపించారు. అలాగే మా తెలుగు తల్లి గీతాన్ని గాయని వసుంధర దేవి ఆలపించారు. వ్యాఖ్యాతగా గజగౌరీ వ్యవహరించారు. చివరిగా పి ఆర్ కేశవులు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
..........