Logo
Date of Publish : 20 July 2024, 10:17 am
Editor : CH. MUKUNDARAO

బిల్కిస్‌ బానో కేసులో దోషులకు షాక్‌

బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

బిల్కిస్‌ బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. రెమిషన్‌ వచ్చేవరకు తమకు బెయిల్‌ మంజూరుచేయాల్సిందిగా దోషులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ పిటిషన్‌ను నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్‌ ఖన్నా, సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా పేర్కొంది. కోర్టులోని ఒక 

బెంచ్‌ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్‌ ఎలా అప్పీల్‌ చేస్తారని ప్రశ్నించింది. కాగా దోషులు రాధేశైమ్‌ భగవాన్‌దాస్‌ షా, రాజుభాయ్‌ బాబూలాల్‌ సోనీ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్‌ అనుమతించింది. షా మధ్యంతర బెయిల్‌ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు.2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో పెద్దఎత్తున చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. 5 నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. దీంతో గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండు వారాల్లోగా జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. 


All Rights Reserved By telugunewstimes
Print Save