విళ్లివాకం న్యూస్: తెలుగు వెలుగు సంక్షేమ సంఘం, చెన్నై ఆధ్వర్యంలో 'విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు' శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. దీనికి స్థానిక పెరంబూర్ స్కూల్ రోడ్డు లోని చెన్నై గర్ల్స్ హైయ్యర్ సెకండరీ స్కూలు వేదికయింది. ముందుగా వరదరాజులు ప్రార్ధనా గీతం ఆలపించారు. సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఏఈఓ జి. మునిరామయ్య విచ్చేశారు.
విశిష్ట అతిథులుగా డాక్టర్ ఎం హనుమంతరావు, దంత వైద్యులు ఎంఎస్ చంద్రగుప్త, విశ్రాంత ఇండియన్ బ్యాంక్ మేనేజర్ కె రవీంద్ర బాబు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మురళి, మోహన్ రావు, సుబ్బరాయుడు పాల్గొన్నారు. ముందుగా అతిథులను సత్కరించారు. ముఖ్య అతిథి మునిరామయ్య మాట్లాడుతూ మనలో తెలుగు భాష పై అభిమానం, ఐక్యత ఉన్నాయన్నారు. తెలుగు సంఘాలు, పాఠశాలలు తెలుగు భాషను పరిపోషించాలని కోరారు.
డాక్టర్ చంద్రగుప్త మాట్లాడుతూ తెలుగు భాష, కార్యక్రమాల పట్ల రాజశేఖర్ కృషి ప్రశంసనీయం అన్నారు. తమ తల్లి మాజేటి జయశ్రీ ట్రస్ట్ పేరిట విద్యార్థులకు స్కాలర్షిప్పులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు అవార్డులను సరళ, అరుణ మోహన్, చారులత అందుకున్నారు. విద్యార్థులకు విజేత పేరిట అవార్డులు, ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు.
విద్యార్థులకు వక్తృత్వ, నృత్య పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవడి వెంకటేశ్వర పాఠశాల, విళ్లివాకం కనకదుర్గ పాఠశాల, పెరంబుర్ ఆర్ బి సి స్కూలు, చెన్నై గర్ల్స్ హైయ్యర్ సెకండరీ స్కూలు, పులియాం తోపు ప్రైమరీ స్కూలు, ఏబీఎం ప్రైమరీ స్కూలు, పట్టాలం హయ్యర్ సెకండరీ స్కూలు, చూలై ప్రైమరీ స్కూలు కు చెందిన విద్యార్థులు ఆటపాటలు ప్రసంగాలతో అలరించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.


................
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com