విళ్లివాకం న్యూస్: చెన్నై, టీ.నగర్ కేసరి మహోన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఒకింత ఆటవిడుపుగాను, కనుమరుగవుతున్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పునరుత్తేజం కలిగే విధంగా జరుపుకున్నారు. అత్యంత శోభాయమానంగా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఆనంద కోలాహాలంలో రకరకాల రంగవల్లులను వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక చక్కటి వేదికగా కేసరి మహోన్నత పాఠశాల నిలయమైనది.
ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులను కొన్ని ప్రత్యేక విభాగాలుగా విభజించి రంగవల్లుల పోటీలను నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ముఖ్య అతిధులుగా పాఠశాల కార్యవర్గ సభ్యులు సుభద్ర దేవి, కోశాధికారి పిఎస్వి కృష్ణ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా కేసరి పాఠశాలల పర్యవేక్షణాధికారి లక్ష్మీ మరియు డాక్టర్ రాజేశ్వరి వ్యవహరించారు, ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగుల గోపాలయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమము జరిగినది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సుద్దేశించి ప్రసంగిస్తూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల పండగని, ఇందులో మొదటిది భోగి పండుగ, రెండవది మకర సంక్రాంతి, మూడవది కనుమ పండుగ అన్నారు. భోగి పండుగ భోగభాగ్యాల పండగని, మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడం వలన దీనిని మకర సంక్రాంతి అని అంటారన్నారు. కనుమ పండుగని పశువుల పండగని కూడా అంటారని తెలియజేశారు. ఈ పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుభద్రదేవి, మరియు పిఎస్వి కృష్ణ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు హరిదాసు వేషముతో అందరినీ అలరింపజేశారు. ఈ కార్యక్రమమును ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థినీ విద్యార్థులు సామూహికంగా జయప్రదం గావించారు.

.........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com