విశాఖపట్నం, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగిన చందనోత్సవ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి తరలివచ్చిన భక్తులు బస చేసిన ప్రదేశంలో గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ, బాధిత కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఎక్స్‌గ్రేషియా రూపంలో ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేయనున్నట్టు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాక, వారి కుటుంబాల్లోని ఒక్కరికి దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. గాయపడిన భక్తుల కోసం ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం అందించనున్నట్లు కూడా ప్రకటించారు.
ఈ దుర్ఘటన, అక్షయ తృతీయ నేపథ్యంలో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చిన సమయంలో చోటుచేసుకోవడం తీవ్ర విషాదకరం. స్వామివారి నిజరూప దర్శనాన్ని పొందాలన్న భక్తుల తహతహతో అక్కడే బస చేసిన భక్తుల్లో చాలామంది ఘటన సమయంలో నిద్రలోనే ఉన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com