విల్లివాకం న్యూస్: సమాజం కోసం జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములని తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, మెంబర్ సెక్రటరీ జె. మేఘనాధ రెడ్డి తెలిపారు. చెన్నై, మైలాపూర్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా 'ఆత్మార్పణ దినం' కార్యక్రమం ఆదివారం ఉదయం జరిగింది. ముందుగా నిడమర్తి వసుంధరా దేవి ప్రార్థన గీతాన్ని ఆలపించారు. చైర్మన్ కె. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగఫలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అని, ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు.
ముఖ్య అతిథిగా జె. మేఘనాధ రెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, సమాజం కోసం ఒక వ్యక్తి ఎన్ని విధాలుగా పోరాడవచ్చునేది ఆయన ద్వారా నేర్చుకోవాల్సిన విషయం అన్నారు. విశిష్ట అతిథిగా ప్రపంచ తెలుగు సమాఖ్య, ప్రధాన కార్యదర్శి, కె శ్రీలక్ష్మి మోహనరావు పాల్గొన్నారు. సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ స్వాగతోపన్యాసం చేసి సభా నిర్వహణ చేపట్టారు. చివరిగా సభ్యురాలు డాక్టర్ ఏవి శివకుమారి వందన సమర్పణ చేశారు. ఇందులో సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, జెఎం నాయుడు పాల్గొన్నారు.
వి. కృష్ణారావు రచించగా, ఎన్ గోపాలయ్య దర్శకత్వం వహించిన 'స్వాతంత్ర్య సమరయోధులు మళ్లీ పుడితే' నాటిక ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిని టి.నగర్ కేసరి పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. వి.కృష్ణారావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనిల్ కుమార్ రెడ్డి విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ రెడ్డి, టామ్స్ అధ్యక్షులు గొల్లపల్లి ఇశ్రాయేలు, ఊరా ఆంజనేయులు, కట్టబ్రహ్మన్న, ఎల్బీ శంకరరావు దంపతులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
....................
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com