Logo
Date of Publish : 07 February 2026, 1:31 pm
Editor : CH. MUKUNDARAO

ఒకప్పుడు భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే ఐక్యత, అనుబంధాలు, పరస్పర బాధ్యతలు.

తాతయ్య–నానమ్మల కథల మధ్య పెరిగిన పిల్లలు, ఇంటిపట్టునే ఉంటూ కుటుంబాన్ని కలిపి ఉంచిన తల్లులు, ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి చేరే తండ్రులు – ఇదే అప్పటి జీవన విధానం.
1990ల వరకు ఎక్కువగా కుటుంబాలు తమ స్థాయికి తగ్గట్టే జీవిస్తూ, అప్పుల జోలికి వెళ్లకుండా, ఉన్నదాంట్లోనే సంతోషాన్ని వెతుక్కునేవి. ఇరుగు పొరుగు వారితో సైతం ఆప్యాయంగా మెలుగుతూ, కష్టసుఖాలు పంచుకునే సంస్కృతి ఉండేది.
కానీ కాలం మారింది. డబ్బు సంపాదన ప్రధాన లక్ష్యంగా మారడంతో కుటుంబాలు విడిపోయాయి. భర్త విదేశాల్లో, భార్య ఉద్యోగాల్లో, పిల్లలు హాస్టళ్లలో, వృద్ధులు వృద్ధాశ్రమాల్లో – ఇదే నేటి కుటుంబ పరిస్థితిగా మారుతోంది.
ఇటీవల చోటుచేసుకున్న విజయశాంతి రెడ్డి మరియు ఆమె ఇద్దరు పిల్లల విషాద మరణం ఈ వాస్తవాన్ని మరింత తీవ్రంగా గుర్తు చేస్తోంది. డబ్బు సంపాదన కోసం భర్త విదేశాల్లో, భార్య నైట్ షిఫ్ట్ ఉద్యోగంలో – ఒకప్పుడు అవసరాల కోసం మొదలైన ఈ దూరం, చివరకు మానసిక ఒత్తిడికి దారి తీసిందని పలువురు భావిస్తున్నారు.
ఏ కారణం ఉన్నప్పటికీ, పిల్లలతో సహా ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేసిన ఘటన. ఈ విషాదం వెనుక ఒంటరితనం, మానసిక వేదన, కుటుంబ సభ్యుల మధ్య దూరం వంటి అంశాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోరడం, మాట్లాడటం, పరిష్కారం వెతకడం అత్యంత అవసరం అని సూచిస్తున్నారు.
డబ్బు మన జీవనానికి అవసరం కానీ, అదే జీవితం కాకూడదు. కుటుంబంతో కలిసి ఉండే ఆనందం, మానసిక శాంతి డబ్బుతో కొనలేనివి. పోటీ, ఆర్భాటం, ఇతరులతో పోల్చుకోవడం చివరికి మనిషిని ఒంటరిగా మారుస్తోంది.
ఈ ఘటన ఒక హెచ్చరిక.
కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి, పోతాయి. వాటిని ఎదుర్కొనే ధైర్యం, కుటుంబం–స్నేహితుల మద్దతే అసలైన బలం. ఆత్మహత్య ఎలాంటి పరిష్కారం కాదు; అది కుటుంబాలకు, సమాజానికి తీరని నష్టం.
ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలని,
మానసిక ఒత్తిడిలో ఉన్నవారు తప్పకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదించాలని సమాజం పిలుపునిస్తోంది.
విజయశాంతి రెడ్డి మరియు ఆమె ఇద్దరు పిల్లలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ –
ఓం శాంతి.
సర్వేజనా సుఖినోభవంతు.
..


All Rights Reserved By telugunewstimes
Print Save