Logo
Date of Publish : 17 June 2026, 10:39 pm
Editor : CH. MUKUNDARAO

తమిళనాట వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు : టిజి వెంకటేష్

విళ్లివాకం న్యూస్: తమిళనాట వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యల తీసుకుంటామని, ఇందుకోసం త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను కలవనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ తెలిపారు. చెన్నై, గిండిలోని ఐటిసి హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైశ్యుల కోసం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విశేష సేవలందిస్తున్నట్లు తెలిపారు. వైశ్య సమాజం వేల సంవత్సరాల నుంచి తన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ తన ఉనికిని చాటుకుంటున్నట్లు తెలిపారు. ఎందరో కులాల వారు మత మార్పిడులకు లోనవుతున్నప్పటికీ ఆర్యవైశ్యులలో ఆ ప్రసక్తి లేదని అన్నారు. దేశ స్వాతంత్రం తరువాత ఎస్సి, బిసి, ముస్లిం, క్రిస్టియన్లకు ఎన్నో హక్కులు కల్పించారని, ఆర్య వైశ్యులు మాత్రం ఇందుకు నోచుకోలేదని, వారంతా వెనుకబడి ఉన్నట్లు తెలిపారు.

ఇటువంటి వారిని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ, తదితర సంస్థల ద్వారా ముందుకు తీసుకువెళుతున్నట్లు తెలిపారు. వైశ్యులను కించపరిచే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రస్టు భూములను, దాతల స్థలాలను కబ్జాదారుల కబంధ హస్తాల నుండి విడిపిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలో సీతమ్మ ట్రస్ట్ కు చెందిన వెయ్యికోట్ల రూపాయల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ వామ్ ఆధ్వర్యంలో వసతి గృహము నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో వైశ్య కార్పొరేషన్లు ఉన్నాయని, తమిళనాడులో కూడా ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు గైకొంటామని అన్నారు. వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం తమ సంస్థ పాటుపడుతున్నట్లు తెలిపారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు గెజిట్ లో 700 కులాలు ఉన్నప్పటికీ ఆర్యవైశ్య కులాన్ని చేర్చక పోవడం విచారకరమన్నారు. త్వరలో మాజీ రాజ్యసభ సభ్యులు, టీజీ వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తో కలిసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను కలుస్తామని అన్నారు. ఈ సమావేశంలో రంగనాయకులు, హరినాథ్, ఎంవి నారాయణ గుప్తా, తాడేపల్లి రాజశేఖర్, త్రినాధ్, చందన్, పి బద్రీనాథ్, శ్రీలత ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

...........


All Rights Reserved By telugunewstimes
Print Save