విల్లివాకం న్యూస్: తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తమ కార్యాలయంలో అభిమానుల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శ్రేయోభిలాషులు, సన్నిహితులు చాలా ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేడుకగా జరిపి సాంఘిక సేవా కార్యక్రమాలను చేయడం తనకు చాలా సంతోషదాయకమని అన్నారు. తమిళనాడులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు 15 కోట్ల మంది ఉన్నారని, నాడు పాఠశాలల్లో తెలుగు మీడియం చదివేవారు పర రాష్ట్రాలలో కాకుండా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా ఉండేవారని, ప్రస్తుతం తెలుగు చదువుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మందికి తెలుగు ఇంటిలో మాట్లాడే భాషగా మాత్రమే ఉన్నదని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు భాష పట్ల వివక్షను చూపే విధంగా ప్రేరణ కలిగించారని, ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే కచ్చితంగా చదివే విధంగా ప్రభుత్వాలు చట్టాలు చేయాలని తెలిపారు. 2024 లో చలనచిత్ర పరిశ్రమ ఎన్నో విజయాలతో ముందుకు సాగిందని, 2025లో చిత్రాలు విజయవంతం అవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కేతిరెడ్డి కోరారు. పుట్టినరోజున ప్రముఖ పారిశ్రామిక వేత్త మల్లికార్జున రెడ్డి, సినీ దర్శకులు కిరణ్, హెచ్ రామలాల్, పి ప్రవీణ్, వెంకటేష్ పి ప్రవీణ్ కుమార్ రెడ్డి, చందన తదితరులు పాల్గొన్నారు.
………..