
విల్లివాకం న్యూస్: కాపు సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో మహిళలకు మూడు రకములైన పోటీలు వరుసగా వంటల పోటీలు, ముగ్గుల పోటీలు, పాటల పోటీలు చక్కగా నిర్వహించారు. ఇందులో అనేక మంది సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు.
ఈ పోటీలకు వంజరపు శివయ్య, వసుంధరా దేవి, రమాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వంటల పోటీలలో పాల్గొన్నవారు వండి తెచ్చిన వంటలన్నింటిని సభికులు రుచిచూచి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వలె ఈ సంవత్సరం కూడా 2025 తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. క్యాలెండర్ ను వితరణగా అందజేసిన ఆకుల ప్రకాష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అనేక మంది ఔత్సాహికులు తమ గాన మాధుర్యమును పాటల ద్వారా వెల్లడించారు. ఇవి సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సభలో బహుమతులను ఒసంగిన వధాన్యులు తలైవాసల్ విజయ్ కు, మరెందరో ప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంక్రాంతి సంబరాలు అధ్యక్షులు గూడపాటి జగన్మోహనరావు నిర్దేశకత్వంలో జరగడం ముదావహం. సభను ఆది నుంచి అంతం వరకు నిర్వహించి అందరిని ఆనందపరిచిన పి.ఆర్ కేశవులు చివరిగా వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు తెలుగు ప్రముఖులు, ప్రజలు హాజరయ్యారు.