విల్లివాకం న్యూస్: సమాజ మార్పు కోసమే జాషువా రచనలు సాగించినట్లు వక్తలు వెల్లడించారు. ప్రముఖ కవి, రచయిత, నవయుగ కవిచక్రవర్తి, కవికోకిల గుఱ్ఱం జాషువా 130వ జయంతిని పురష్కరించుకుని శుక్రవారం మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ఆధ్వర్యంలో సాహితీవేత్తల జయంత్యుత్సవాల సందర్భాన్ని పురష్కరించుకుని 'సాహిత్యకారుల జీవనచిత్రాలు'లో భాగంగా గుఱ్ఱం జాషువా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ జాషువా సమాజంలోని హెచ్చుతగ్గులను
వెతికి దానికి గల కారణాలను పరిశీలించి, అనేక కోణాల నుంచి ఆలోచించి తన కంఠంలోని ఆవేదనను కవిత్వ మార్గంగా ఎంచుకున్నారన్నారు. అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం వారి కలం నుంచి అనేక కవిత్వ బాణాలను సంధించారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జలదంకి కోదండ రామిరెడ్డి జాషువా సాహిత్య సారాన్ని, వారి రచనలోని గొప్ప పద్యాలను అద్భుతంగా గానం చేసి సభికులను రజింపచేశారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన డా. నిర్మలా పళనివేలు, కవి గొప్పతనాన్ని తెలియజేస్తూ జాషువా గారి ఆలోచనలు, ఆరాటం, తపన అంతా సమాజ మార్పు కోసమే... జాషువా కలాన్ని గళంగా మార్చి విశేష సాహిత్య సంపదను సృష్టించారని తెలిపారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కుమారి బిట్రా గజగౌరి, జాషువా జయంతిని ఏర్పాటు చేసిన తెలుగుశాఖ అధ్యక్షుల ఆలోచన చాల అభినందనీయం అని, మహాకవుల జీవితాలు ఆదర్శప్రాయమని, వారు సూచించిన మార్గాలు సమాజాన్ని పురోగమనం వైపు పయనింపజేస్తాయని పేర్కొన్నారు. మద్రాసు క్రైస్తవ కళాశాల తెలుగుశాఖ
ఆచార్యులు డా. శ్రీపురం యజ్ఞశేఖర్ జాషువా రచనలో సహనం, సమానత్వం ప్రస్తుత సమాజంలో కనిపించే ధోరణులు ఆనాడే తెలియజేశారని, ముఖ్యంగా సమాజంలోని అసమానతలపై కలం ఝళిపించిన విశ్వనరుడు జాషువా అన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, తెలుగుశాఖాధ్యక్షులు డా. జడా సుబ్బారావు జాషువా రచనలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని, జాషువాని ఒక కులానికి, ఒక మతానికి అంటకట్టకూడదని, కవులకు సమాజ శ్రేయస్సే కాని ఇవి ప్రమాణాలు కావని అన్నారు. అలాగే జాషువా తన సాహిత్యం ద్వారా సమాజంలో అణగారిన వారి సమస్యలను ఎండగట్టారని పేర్కొన్నారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతం పలకగా, తెలుగుశాఖ అధ్యాపకులు డా. పాండురంగం కాళియప్ప వందన సమర్పణ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆచార్య ఎల్.బి. శంకరరావు దంపతులు, డా. ఎలిజబెత్ జయకుమారి, డా. మోహన కూమారి, డా.ఏ.వి. శివకుమారి, పి.సి. పాపయ్య, అజరత్తయ్య, నాగేశ్వరరావు, నెల్లుట్ల శ్రీనివాసులు, ధనుంజయ్ తదితరులు విచ్చేసారు.
అలాగే, తెలుగుశాఖ ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్. డి. విద్యార్థులు పాల్గొన్నారు.
..........................
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com