విళ్లివాకం న్యూస్: జనని (సాంఘిక సాంస్కృతిక సమితి), చెన్నై ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. చెన్నై, మైలాపూర్ లోని అమరజీవి స్మారక మందిరం దీనికి వేదికయింది. కార్యక్రమంలో ముందుగా రచయిత్రి అరుణ శ్రీనాథ్ స్వాగతోపన్యాసం చేశారు. ప్రార్ధనా గీతాన్ని నెల్లుట్ల లీల ఆలపించారు. జనని అధ్యక్షులు డాక్టర్ నిర్మలా పళనివేలు సభకు అధ్యక్షత వహించారు. వక్తలుగా చెన్నై రాజధాని కళాశాల, తెలుగు శాఖాధ్యక్షులు, డాక్టర్ ఎన్ ఎలిజబెత్ జయకుమారి, రచయిత్రులు తిరుమల ఆముక్త మాల్యద, క్రొవ్విడి రమాదేవి విచ్చేశారు. ముందుగా నిర్మలా పళనివేలు మాట్లాడుతూ యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని మాతృభాష దినోత్సవంగా ఏర్పాటు చేయడం గర్వకారణమని, అలాగే గిడుగు రామమూర్తి జయంతిని కలిపి పండుగలుగా జరుపుకుంటున్నామని అన్నారు. మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలిపారు.
ఎలిజబెత్ జయకుమారి మాట్లాడుతూ తుమ్మల సీతారామమూర్తి చౌదరి రాసిన 'రాష్ట్రగానం' లో ఆంధ్రుడనై జన్మించితిని అనే రచన గురించి ప్రస్తావించారు. అలాగే మన పూర్వ కవులు తెలుగు భాష ఔన్నత్యాన్ని కొనియాడినట్లు పేర్కొన్నారు. అముక్త మాల్యద మాట్లాడుతూ అమ్మంటే ఎలా ఉంటుందో అమ్మ భాష అలా ఉంటుందని తెలిపారు. ఏ భాష వచ్చినా ఆ భాషలో నైపుణ్యం సాధిస్తే రాణించవచ్చని తెలిపారు. ప్రాథమిక భాష తెలుగు అయితే ఇతర భాషలను సులబంగా నేర్చుకోవచ్చని తెలుసుకోవచ్చని తెలిపారు. రచయిత్రి క్రొవ్విడి రమాదేవి మాట్లాడుతూ అమృతం కన్న, అమ్మ పాల కన్న, అన్య భాషల కన్న తెలుగు భాష అమృతమైనదని తెలిపారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తెలుగు భాష తియ్యనైనదని, మధురమైన తెలుగు భాషను మరువకూడదని తెలిపారు. ఆర్.ఎస్.శర్మ రాసిన తెలుగు భాషపై సందేశాన్ని చదివి వినిపించారు. అలాగే, వంజరపు శివయ్య మాట్లాడుతూ తెలుగు భాషా ప్రాముఖ్యత తగ్గుతోంది గాని, తెలుగు భాష చచ్చిపోలేదని తెలిపారు. తెలుగులో విద్య నభ్యసించి ఇతర దేశాల్లో రాణిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. శిరీష మాట్లాడుతూ ఇంట్లో తెలుగు మాట్లాడితే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఆచార్య విస్తాలి శంకరరావు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ తెలుగు భాషపై రాసిన 'బహుజన్మ కృతపేన్య పరిపాకమున జేసి' అనే పద్యాన్ని రాగయుక్తంగా వినిపించారు. వ్యాఖ్యాతగా అరుణా శ్రీనాథ్ వ్యవహరించారు.
వందన సమర్పణ నాగమణి చేశారు. ఇందులో ఎల్ బి శంకరరావు దంపతులు, క్రొవ్విడి హరినాథ్, నెల్లుట్ల శ్రీనివాస్, శ్యామల, లయన్ రేవతి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
.........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com