Logo
Date of Publish : 11 July 2025, 1:58 pm
Editor : CH. MUKUNDARAO

హిందీ మన పెద్దమ్మ భాష: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌:"మన మాతృభాష అమ్మ అయితే, రాజ్య భాష అయిన హిందీ మన పెద్దమ్మ," అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రపంచం విడిపోవడానికి కారణాలు వెతుకుతుంటే, మన దేశం ఏకతాటిపైకి రావడానికి హిందీ వంటి రాజ్య భాష దోహదపడుతోందన్నారు. “ఒక బెంగాలీ పాట జాతీయ గీతంగా మారింది, పంజాబీ భగత్ సింగ్ దేశం కోసం పోరాడాడు, రాణా ప్రతాప్ సౌర్యానికి గుర్తుగా నిలిచారు, అబ్దుల్ కలాం దేశం గర్వించే శాస్త్రవేత్త అయ్యారు, ద్రవిడ ప్రాంతంలో రూపొందిన మువ్వన్నెల జెండా భారత్ జెండా అయింది” అని ఉదాహరణలు చెప్పారు.

ప్రతి భాషకూ జీవం ఉందని, మాతృభాష ఇంటి భాషైతే, హిందీ దేశంలోని పరస్పర సంబంధాల కోసం అవసరమయ్యే భాషగా మారిందని అన్నారు. "ఇంటి బయట మాట్లాడుకునేందుకు హిందీ తప్పనిసరి. మన మాతృభాషలు గౌరవించాల్సిందే కానీ, హిందీకి వ్యతిరేకంగా వ్యవహరించడం అనర్థకమైనది" అన్నారు.

విద్య, ఉపాధి, వ్యాపారం, సినిమా రంగాల్లో హిందీ ఉపయోగాన్ని వివరించిన పవన్, “దక్షిణ భారతీయ సినిమాల్లో 31% హిందీలో డబ్ చేసి పెద్ద ఆదాయం వస్తోంది. అప్పుడు వ్యాపారం కోసం హిందీ అవసరం అయితే, నేర్చుకోవడంలో ఇబ్బంది ఏముంది?” అని ప్రశ్నించారు.

భాష నేర్చుకోవడం మన ఉనికిని తగ్గించడం కాదని, అది మన బలం పెంచడమేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.


All Rights Reserved By telugunewstimes
Print Save