విల్లివాకం న్యూస్: శ్రీ వేణుగోపాల్ విద్యాలయ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్ 44వ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. దీనికి తేనాంపేటలో గల కామరాజ్ అరంగం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లైఫ్ లైన్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జె ఎస్ రాజ్ కుమార్ విచ్చేశారు.
అధ్యక్షులు కే అనిల్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షులు కే ఆనంద్ కుమార్, సెక్రటరీ కరస్పాండెంట్ వి గోవింద్, షీలా బాలకృష్ణన్ వేదికనలంకరించారు. అధ్యక్షులు కె. అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 44 ఏళ్లుగా శ్రీ వేణుగోపాల విద్యాలయం నిరాటంకంగా కొనసాగుతోందని, 27 ఏళ్లుగా తెలుగు మహాజన సమాజం నడుస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాభ్యాసంలో క్రమశిక్షణకు ప్రాముఖ్యత ఇస్తామని తెలిపారు. పాఠశాలలో 99% విద్యార్థిని, విద్యార్థులు అత్యధిక విద్యనభ్యసించే వారిగా విరాజిల్లుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వెనుకబడిన తరగతుల వారికి ఉచిత విద్యను కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనండి.. కలలను సాకారం చేసుకోండని విద్యార్థులకు హితవు పలికారు. ముఖ్య అతిధి రాజ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వేణుగోపాల విద్యాలయలో విద్యనభ్యసించిన ఎంతోమంది ఉన్నత స్థానాలలో ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన రతన్ టాటా సామాన్యులకు లక్ష రూపాయలకే నానో కారును రూపొందించి వారి ఆశ నెరవేర్చినట్లు తెలిపారు. తెలుగు వారైన పింగళి వెంకయ్య మన భారత పతాకాన్ని రూపొందించారని పతాకాన్ని చూడగానే మనం భారతీయులం అని గర్వంగా చెప్పుకునే స్థాయి వచ్చినట్లు తెలిపారు. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే ఉద్యమాన్ని లేవదీసి అమరుడైనట్లు తెలిపారు. కన్నతల్లిని, మాతృభాషను అలాగే విద్యను బోధించే గురువులను మరవకూడదని అన్నారు. పాఠశాల వార్షిక నివేదికను కరస్పాండెంట్ వి.గోవింద్ చదివి వినిపించారు. ఇలంగో వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చివరిగా విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
..............
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com