
విల్లివాకం న్యూస్: తమిళనాడు ఆదిఆంధ్ర అరుంధతీయ మహాసభ (టామ్స్) వ్యవ స్థాపకులు, జనోదయం డైరెక్టర్ డాక్టర్ గొల్లపల్లి ఇశ్రాయేలు మాతృమూర్తి దివంగత గొల్లపల్లి చంద్రమ్మ సేవలు ఎనలేనివని పలువురు వక్తలు కొనియాడారు. గత నెల 23న వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా మృతిచెందిన చంద్రమ్మ ఆదరణ కూడిక గురువారం కీల్పాక్కంలోని టీపీసత్రం అన్నా కమ్యూనిటీ హాలులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన ఆమె చిత్రపటానికి కుమారులు గొల్లపల్లి ఇశ్రాయేలు, ఆశీర్వాదం, కుమార్తెలు కె.సంపూర్ణమ్మ, ఎం.శారమ్మ, కోడళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, రెవరెండ్ డాక్టర్ ఎస్ ప్రకాశ్ రాజ్ రెవరెండ్ డాక్టర్ బొటుమంచి హనోక్ జాన్వెస్లీ, బిషప్ లు దేవదాస్ పాత్ర, ఏబేలు నీలకంఠన్, లెఫ్టినెంట్ కల్నల్ జాన్ విలియమ్స్, ఎలీషాకుమార్, టామ్స్ అధ్యక్షుడు నేలటూరి విజయ కుమార్, తెలుగు సంఘాల పాస్టర్లు, శ్రేయోభిలాషులు, బంధువులు, టామ్స్ నిర్వాహకులు సహా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.
ఈ సభలో మాట్లాడిన పలువురు వక్తలు మనిషి విలువ తను చేసే సేవా కార్యక్రమాల ద్వారా తెలుస్తుందని, ఇతరుల క్షేమం కోసం జీవించేవారు చరిత్రలో కలకాలం నిలిచిపోతారన్నారు. ఇటువంటి ఆశయాలతో జీవించిన తల్లి చంద్రమ్మ పెంపకంలో శ్రద్ధగా చదువుకున్న గొల్లపల్లి ఇశ్రాయేలు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను స్పూర్తిగా తీసుకున్నారని, అరుంధతీయుల హక్కుల కోసం పోరాడి, ప్రభుత్వాన్ని మెప్పించి 3శాతం రిజర్వేషన్ సాధించారన్నారు.
సమాజసేవలో ఎంతగానో రాణిస్తున్న ఇశ్రాయేలు అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలో నిర్వహించిన 16 రోజుల సమావేశంలో పాల్గొని అణగారిన వర్గాల సమస్యలపై ప్రసంగించారన్నారు. అలాగే పలు దేశాల్లో పర్యటించి దళిత వర్గాల సమస్యలను పరిష్కరింపజేశారని వక్తలు పేర్కొన్నారు.
……….