Logo
Date of Publish : 28 May 2025, 12:33 pm
Editor : CH. MUKUNDARAO

రాజ్యసభకు కమల్ హాసన్‌ పేరు ఖరారు చేసిన డీఎంకే

చెన్నై న్యూస్: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీతి మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌ రాజ్యసభలో అడుగుపెట్టడానికి సమయం దగ్గరపడింది. డీఎంకే పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఈ మార్గం స్పష్టమైంది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆయన తమిళనాడు నుంచి పోటీ చేయనున్నారు.

ఈసారి రాజ్యసభలో ఖాళీ అయిన 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆరు తమిళనాడు, రెండు అసోం రాష్ట్రాల నుంచి ఉన్నాయి. తమిళనాడులోని ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం, డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో, ఆ పార్టీకి నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్టు అంచనా. మిగతా రెండు స్థానాలు అన్నాడీఎంకేకి వెళ్లే అవకాశముంది.

డీఎంకే తన అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. కమల్ హాసన్‌తో పాటు సిట్టింగ్ ఎంపీ టిరుచ్చి శివ, రచయిత్రి సల్మా, పార్టీ సీనియర్ నేత ఎస్‌ఆర్‌ శివలింగం పేర్లను వెల్లడించింది.

కమల్ హాసన్‌ 2018 ఫిబ్రవరిలో మక్కల్ నీతి మయ్యం పార్టీని ప్రారంభించినా, ఇప్పటివరకు ఎలాంటి ఎన్నికల్లోనూ విజయాన్ని నమోదు చేయలేకపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 3.72% ఓటు షేర్‌ సాధించినా, ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమల్‌ పోటీ చేసిన కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. అలాగే 2022 మునిసిపల్ ఎన్నికల్లోనూ పార్టీ ఖాతా తెరవలేదు.

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన కమల్‌ హాసన్‌ డీఎంకేతో అణుగుణంగా పనిచేశారు. అప్పటినుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా నియామకంపై చర్చలు జరుగుతున్నట్లు తమిళ రాజకీయ వర్గాలు తెలిపాయి. చివరికి, డీఎంకే ఆ అవకాశం కల్పించడంతో ఆయన పార్లమెంటులో అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది.
................


All Rights Reserved By telugunewstimes
Print Save