Logo
Date of Publish : 30 May 2026, 3:59 pm
Editor : CH. MUKUNDARAO

భాషా విధానంపై గందరగోళం.. తెలుగు విద్యార్థుల ఆందోళన

– తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

చెన్నై న్యూస్:భాషా విధానంపై తమిళనాడులో రాజకీయ నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితి విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు భాషల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది హిందీ కాని రాష్ట్రాలపై హిందీని పరోక్షంగా రుద్దే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో తమిళం, ఆంగ్లం మాత్రమే కొనసాగుతాయని, మూడు భాషల విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆరో తరగతి నుంచి మూడు భాషల విధానాన్ని స్వాగతించినప్పటికీ, ఈ విద్యా సంవత్సరంలోనే తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం ముందుగా 2029–30 నుంచి అమలు చేస్తామని ప్రకటించి, ఇప్పుడు అకస్మాత్తుగా మార్పులు చేయడం విద్యార్థులపై అదనపు భారం మోపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఇద్దరు నాయకుల భిన్నమైన ప్రకటనలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయని జగదీశ్వర రెడ్డి అన్నారు.
మూడు భాషల విధానం అంటే ఏమిటి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం–2020 (NEP 2020) ప్రకారం విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. ఐదో తరగతి వరకు, వీలైతే ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని ఈ విధానం సూచిస్తోంది.
యునెస్కో కూడా పిల్లలు తమ మాతృభాషలో విద్యను ప్రారంభిస్తే పాఠాలు సులభంగా అర్థమవుతాయని, ఆలోచనా శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొంటోంది.
తమిళనాడులో తెలుగు పిల్లల పరిస్థితి
తమిళనాడులో రెండు భాషల విధానం కొనసాగుతున్నప్పటికీ, తెలుగు భాషా ఉపాధ్యాయులను ప్రభుత్వం తగిన సంఖ్యలో నియమించలేదని ఆయన ఆరోపించారు. తెలుగు మాతృభాష పరీక్ష మార్కులను మొత్తం మార్కుల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదని, దీంతో అనేక తెలుగు కుటుంబాలు తమ పిల్లలను బలవంతంగా తమిళ మాధ్యమంలో చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఇది తెలుగు భాష అభివృద్ధికి నష్టమని, భవిష్యత్తులో పిల్లలు తమ మాతృభాషను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే కేరళ రాష్ట్రంలోని కాసరగోడ్ ప్రాంతంలో మలయాళాన్ని మొదటి భాషగా తప్పనిసరి చేసే చర్యల కారణంగా కన్నడ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితులు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తమిళనాడు తెలుగు యువశక్తి డిమాండ్లు:
వెంటనే తెలుగు భాషా ఉపాధ్యాయులను నియమించాలి.
మాతృభాష పరీక్ష మార్కులను మొత్తం మార్కుల్లో కలపాలి.
ప్రతి విద్యార్థికి తన మాతృభాషలో చదివే హక్కును గౌరవించాలి.
విద్యా విధానాలపై తల్లిదండ్రుల కమిటీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలు తీసుకునే విధంగా చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను కోరారు.
భాషల పేరుతో ఉద్యమాలు, ఘర్షణలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
“మా భాష – మా హక్కు” “మాకు తెలుగు నేర్చుకునే హక్కు కావాలి”
అని ఆయన పేర్కొన్నారు.


All Rights Reserved By telugunewstimes
Print Save