విల్లివాకం న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల ధర్మనిధి ఉపన్యాసాలు గురువారం ముగిశాయి. గురువారం ఉదయం మూడవ సమావేశంలో రెండు ధర్మనిధి ఉపన్యాసాలు జరిగాయి. మొదటగా ఎన్.ఆర్. చందూర్ స్మారక ధర్మనిధి ఉపన్యాసంలో మదురై విశ్వవిద్యాలయం, తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య జొన్నలగడ్డ వెంకటరమణ జర్నలిజం మహిళ : చర్చనీయాంశాలు అనే అంశంపై మాట్లాడుతూ సంఘ జీవితాన్ని సాహిత్య ప్రక్రియలు ఒక్కో ప్రక్రియ ఒక్కో కోణం నుంచి చూస్తే జర్నలిజం (పత్రికలు) అన్ని కోణాల్నించి చూసి ప్రచారం చేస్తాయని, ఒక్కో సారి వ్యాఖ్యానం చేస్తాయన్నారు. ఆ నమ్మకంతోనే జర్నలిజం (పత్రికల) ద్వారా నాటి స్త్రీ సామాజిక పరిస్థితిని అంచనావేయడానికి ప్రయత్నం చేయవచ్చన్నారు.
19వ శతాబ్దం తర్వాత మహిళల స్థితిగతులు మారాయని, మహిళల విషయంలో జర్నలిజం చూపు ప్రత్యేకంగా ఉందని తెలిపారు. జర్నలిజం ద్వారా స్త్రీ విద్యా ఆవశ్యకత, ఆర్థిక స్వేచ్ఛ, ఎన్నో ఉండాలని, ఇంకా సమాజంలో స్త్రీ వివక్ష, పురుషాధిక్యత ఎలా ఉన్నాయో వివిధ ఉదాహరణల ద్వారా తెలియజేశారు.
రెండవది ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ధర్మనిధి ఉపన్యాసంలో సీనియర్ జర్నలిస్ట్ ఈతకోట సుబ్బారావు పచ్చని చెట్టంత చరిత్ర- మాడభూషి సాహిత్యం అనే అంశంపై ప్రసంగిస్తూ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గురించి కావ్యమే రాయవచ్చని, నలభై ఏళ్ల సాహిత్య ప్రస్థానంలో గ్రంథమే రాయవచ్చని, వారి సాహిత్యం, వారి ప్రతిభా పాటవాలను చవి చూసిన వారెవరైనా ఆ ప్రేరణ స్ఫూర్తితోనే సరికొత్త కోణంలో వారిని ఆవిష్కరిస్తారన్నారు. వారొక నడిచే విజ్ఞాన సర్వస్వమని, నిజానికి వారి కంటే ముందు వారి సాహిత్యంతోనే నాకు పరిచయం. మాడభూషి సాహిత్య జీవితంపై విశ్లేషణాత్మక వ్యాసాలు, పరిశోధనలు చాలానే చదివానని తెలిపారు. ఇంత సీరియస్ గా సాహిత్వాన్ని పరిగణనలోకి తీసుకొనే సాహితీవేత్తలు చాలా తక్కువని, అవసరాల కోసం, అవార్డుల కోసం, సాహిత్వాన్ని నిచ్చెన మెట్లుగా వాడుకొనే రోజుల్లో యజ్ఞంలా భావించి అందుకోసం తపించేవారని, కవిత రాసినా, ముందుమాట రాసినా, సమీక్ష చేసినా విమర్శనాత్మక వ్యాసం లేదా ఓ ప్రాజెక్టు రూపొందించాలన్నా అవసరానికి మించి కష్టపడే అసలు సిసలు సాహిత్యమూర్తి మాడభూషి అని, మాడభూషి జీవిత నేపథ్యమే సాహిత్య నేపథ్యంగా ఎదిగిందని, కరోనా కాలంలో వారి సేవలు, వారి సాహిత్యం ఆధారంగా వ్యక్తుల మనస్తత్వాలు, ప్రకృతి స్వభావం దేశ ప్రగతి, యుద్ధాలు మొదలైన వాటి పట్ల మాడభూషి స్పందించిన తీరును పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈతకోట సుబ్బారావుగారికి మాడభూషి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం నాల్గవ సమావేశంలో ములమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసంలో భాగంగా తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం, సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ మహాభారతానువాదంలో ఔచిత్యం అనే అంశంపై ప్రసంగిస్తూ మహాభారతమనేది సకలశాస్త్రాలకు, విషయాలకు ఆలవాలమయిందన్న విషయాన్ని, ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన విషయాలే కావు, లౌకిక మయిన సమస్త విషయాలను కూడా భారతం నుంచి గ్రహించవచ్చునని, ఆంధ్ర మహాభారతాన్ని పరిశీలించినప్పుడు సంస్కృత భారతంలోని ఈ సమస్త గుణాలతో పాటు అనువాదమనే అదనపు గుణం కూడా మనకు కనిపిస్తుందని, నన్నయ అనువాద విధానాన్నే తిక్కన, ఎర్రనలు కూడా అనుసరించారనడంలో ఎలాంటి సందేహంలేదన్నారు. నన్నయ భాషకు, కావ్యరచనా విధానానికి, తిక్కన భాషకు, ఆయన రచనా విధానానికి కాలక్రమంలో వచ్చిన పరిణామం కనిపిస్తుంది. కానీ అనువాదంలో మాత్రం ఇద్దరిదీ ఒకే బాణీ. ఎర్రన కావ్యరచనతో పాటు అనువాద విధానాన్ని కూడా నన్నయనే అనుసరించినట్టు చెప్పవచ్చు. కావ్యరచనా విధానాన్ని బట్టి అనువాదం కూడా వేర్వేరు విధాలుగా సాగినట్టు కనిపించినా, నిజానికి కవిత్రయానిది ఒకే అనువాద విధానమని, మహాభారత రచనే ఔచిత్యవంతమైనదన్నారు. కవిత్రయ భారత విశిష్టతలను తెలియజేస్తూ, అనువాదంలో తెలుగు కవులు పాటించిన ఔచిత్య పద్ధతులను వివిధ సన్నివేశాల ద్వారా పేర్కొన్నారు.
చివరగా సాయంత్రం ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఈ ధర్మనిధి ఉపన్యాసంలో మొత్తం ఆరుగురు ఉత్తమ పండితులు, తెలుగు సాహిత్య క్షేత్రంలో కృషిచేస్తూ సాహిత్య పరిమళాలను పాఠకులకు అందిస్తూ సాహిత్య పూతోటలో పయనిస్తున్నటువంటివారన్నారు. అలాంటి విలక్షణ లక్షణాలుగల ఉపన్యాసకులను ఆహ్వానించామని, అద్భుతమైన ఉపన్యాసాలు చాలా చక్కగా ఉన్నాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ఎ. ఆంబ్రూణి తెలుగుశాఖ పూర్వ వైభవాన్ని, ధర్మనిధి ఉపన్యాసాల ఏర్పాటు తీరును అభివర్ణిస్తూ తెలుగుశాఖ కార్యక్రమ నిర్వహణ విశిష్టతను, ఈ శాఖలోని అధ్యాపకులు, విద్యార్థుల అనుబంధాల విశిష్టతను తెలిపారు. ఈ శాఖ ద్వారా విద్యార్థుల కృషికి ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆచార్య విస్తాలి శంకరరావుగారిని అభినందిచారు. ధర్మనిధి ఉపన్యాసల ప్రత్యేక సంచికను ముఖ్య అతిథి ఆంబ్రూణి ఆవిష్కరించగా, మొదటి ప్రతిని సుబ్బలక్ష్మి స్వీకరించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన క్రొవ్విడి రమాదేవి మాట్లాడుతూ మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో జరుగుతున్న కార్యక్రమాలు పాఠకులకు అత్యంత విలువైవిగా ఉన్నాయని, వీటిని వింటుంటే తమకు విద్యార్థి దశ గుర్తుకు వస్తుందని అలా గొప్ప కార్యక్రమాలను చేపడుతున్న తెలుగుశాఖను అభినందించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వల్లాప్రగడ స్రవంతి మాట్లాడుతూ ఇటుంటి ఉపన్యాసాలు నేటి యువకులను రేపటి వక్తలుగా తయారు చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేశారు.
ధర్మనిధి ముగింపు సందేశాన్ని అందించిన పెద్దాడ సాయి సూర్య సుబ్బలక్ష్మి ఈ ధర్మనిధి ఉపన్యాసాల విశిష్టతను తెలియజేస్తూ, ఈనాటి ఈ విత్తనాలు ఏనాడో నాటిన చెట్టువని సంబోధిస్తూ, విద్యా దానంలో ధర్మనిధి ఉపన్యాస స్థాపకులు అనుసరించిన తీరు ఆదర్శ ప్రాయమని, ఆ ఫలాలను పలువురికి చేరేలా కృషి చేస్తున్న తెలుగుశాఖ నిర్వాహణను ప్రశంసిస్తూ పలువురు ఈ శాఖ అభివృద్ధిలో పాటుపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఐ. గ్లోరి స్వాగతం పలకగా, పసల చైతన్య కుమార్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమానికి ఆచార్య ఎల్.బి.శంకరరావు దంపతులు, గుడిమెట్ల చెన్నయ్య, డా. ఏ.వి. శివకుమారి, ఆముక్తమాల్యద, ఆత్మకూరు అజరత్తయ్య, నెల్లట్ల దంపతులు, రాజధాని కళాశాల అధ్యాపకులు, రాణీమేరి కళాశాల అధ్యపకులు, విద్యార్థిని విద్యార్థులు, అలాగే మద్రాసు విశ్వవిద్యాలయం ఎం.ఏ., మరియు పిహెచ్.డి. విద్యార్థులు విచ్చేశారు.
...........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com