
చెన్నై న్యూస్ : యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎస్కేడీటీ మహోన్నత పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి తెలిపారు.
ఎస్కేడీటీ తెలుగు మహోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జయ విద్యా సేవా ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఏ. కనకరాజ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు వివిధ యోగాసనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రతిరోజూ చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యం, మనసుకు ప్రశాంతత లభిస్తాయని అన్నారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు, ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. యోగాసనాలు శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు.
ప్రొఫెసర్ ఏ. కనకరాజ్ యోగా యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థులు చక్కగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎస్కేడీటీ మహోన్నత పాఠశాల కోశాధికారి ఎన్. నరసింహులు పాఠశాల అభివృద్ధి కోసం రూ.1,00,000 విరాళాన్ని అందజేశారు. తెలుగు విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్కేడీటీ పాఠశాలల కార్యదర్శి డాక్టర్ సీఎంకిషోర్, యోగా గురువు దినేష్ కుమార్, ఉపాధ్యక్షులు నందగోపాల్, ప్రాథమిక పాఠశాల కార్యదర్శి ఎన్. నాగభూషణం, ప్రధానోపాధ్యాయురాలు సారా సుహాసిని, తెలుగు ప్రముఖులు తాళ్లూరు సురేష్, పాఠశాల కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కిరణ్ కుమార్ రెడ్డి వందన సమర్పణ చేశారు.
పాఠశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులకు మేనేజ్మెంట్ సమక్షంలో ఉపాధ్యాయులు సొంతగా యూనిఫామ్, ట్రైన్ సీజన్ టికెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.