
ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ అనగానే.. రెండు రాష్ట్రాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది విశ్లేషకులు తమవైపు నుంచి భారీగా సలహాలూ, సూచనలూ ఇచ్చారు. ఇదివరకు లేని డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. దాంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో జరిగే భేటీలో సానుకూల స్పందనలు ఎంతవరకూ వస్తాయి అనేది చర్చగా మారింది. ఐతే.. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మంచి సఖ్యత ఉంది కాబట్టి.. ఇవాళ్టి భేటీలో కొంతవరకూ సానుకూలత ఉంటే ఉండొచ్చుగానీ… పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైనా పాజిటివ్ అవుట్‌పుట్ వస్తుందనే గ్యారెంటీ లేదు.
చర్చించే అంశాలు ఇవే:
ఇవాళ్టి మీటింగ్‌లో సీఎంలతోపాటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్‌లు, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారు. ప్రధాన అజెండాగా.. విభజన సమస్యలపై చర్చ ఉండబోతోంది. అలాగే.. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని ఆర్టీసీ, ఆర్థిక సంఘం, తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్శిటీ, ఉన్నత విద్యామండలి వంటి 30 సంస్థల స్థిర, చర ఆశ్తులపై చర్చ జరగనుంది. ఇంకా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ, విద్యుత్ సంస్థల బకాయిలు (రూ.24 వేల కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉండగా.. తెలంగాణ నుంచి రూ.7వేల కోట్లు రావాలని ఏపీ అంటోంది.), రెండు రాష్ట్రాల్లో ఉద్యోగుల బదిలీల అంశాలపై కూడా చర్చ సాగనుంది. ఇక ఏపీలో కలిపిన 5 భద్రాచలం గ్రామాలైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, పిచుకులపాడు, కన్నాయిగూడెం పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలనే అంశంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే ఈ భేటీ రాత్రి 10 గంటల వరకూ జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.
న్యాయం జరిగేనా?
ఇవాళ్టి భేటీ ఎంతవరకూ ఫలప్రదం అవుతుందనేది చర్చగా ఉంది. ఎందుకంటే.. రెండు రాష్ట్రాల సీఎంలూ తమ తమ రాష్ట్రాలకు అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటారు. ఏపీ నిర్ణయాలు తెలంగాణకు సమస్య కాగలవు, అలాగే తెలంగాణ నిర్ణయాలు ఏపీకి సమస్య కాగలవు. అలాంటప్పుడు.. ఈ భేటీ ఫలప్రదం ఎలా అవ్వగలదు అనే చర్చ సాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం రెండు రాష్ట్రాలకూ సమన్యాయం జరిగేలా చేస్తామని అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ భేటీపై సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.