
అమరావతి: ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. విజయానంద్‌కు అందజేసింది. మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఈ కమిషన్, 2023 నవంబర్ 15న ఏర్పడి, వివిధ ఎస్సీ ఉపకులాల అభిప్రాయాలు సేకరించి, పలు సంస్థలతో చర్చించిన తర్వాత ఈ నివేదికను సిద్ధం చేసింది.
ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం
ఈ కమిషన్ ఎస్సీ ఉపవర్గాల ఆర్థిక స్థితి, రిజర్వేషన్ విధానం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పరిశీలన చేసి, సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించి రిజర్వేషన్ అమలు చేస్తుండగా, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
డీఎస్సీ ప్రకటనకు లైన్ క్లియర్!
ప్రభుత్వం ఈ నివేదికను తొలుత కేబినెట్‌కు అందజేసి, ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో చర్చించనుంది. అనంతరం ఆమోదిస్తే ఎస్సీ వర్గీకరణ అమలులోకి రానుంది. అదే సమయంలో డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేసి, త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
మాదిగ దండోరా నాయకులు మంద కృష్ణ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిని బట్టి, వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
(ఈ వార్తలో మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవండి.)
…………..