
తిరుమల: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ తన కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా ఉండటానికి కృతజ్ఞతగా, స్వామివారికి మొక్కిన తలనీలాలు సమర్పించారు.
తిరుమలలో ఆమె తల ముండించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు, అన్నా లెజ్నెవా తల్లిగా చూపిన ఆరాటాన్ని కొనియాడుతున్నారు. ఎంతో మంది ప్రజలు ఆమె నిబద్ధతను, భక్తిశ్రద్ధను ప్రశంసిస్తున్నారు.
సింగపూర్‌లోని ఓ నివాసంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ వార్త అందరికీ షాక్ ఇచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కల్యాణ్, అన్నా లెజ్నెవా, చిరంజీవి సింగపూర్ వెళ్లి, మార్క్ ఆరోగ్యాన్ని చూసి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కి తిరిగివచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే అన్నా లెజ్నెవా తిరుమల బయలుదేరారు.
తిరుమలలో గాయత్రి నిలయంలో బస చేసిన ఆమె, ఆదివారం రాత్రి కొండపై ఉండి, సోమవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. తన కుమారుడిని రక్షించిన దేవుడికి కృతజ్ఞతగా తల ముండించుకోవాలనే నిర్ణయం ఆమె తీసుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు తలనీలాల ఏర్పాట్లు చేయడంతో పాటు, ప్రత్యేక గౌరవాలను అందించారు.
అన్నా లెజ్నెవా రష్యా దేశస్తురాలు, క్రైస్తవ మతానికి చెందినవారు అయినప్పటికీ, తిరుమల దర్శనానికి అవసరమైన డిక్లరేషన్‌ను ఇచ్చి భక్తితో స్వామివారిని దర్శించుకున్నారు. ఆమె భక్తి ప్రజల మనసులను హత్తుకుంటోంది.
జాతీయ స్థాయిలో స్పందన
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున స్పందన వచ్చింది. మార్క్ శంకర్ ప్రమాదంలో గురికావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. శీఘ్రంగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉండటం తల్లిదండ్రులకు ఊరటనిచ్చింది.
తల్లిగా కుమారుడి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చేసిన మొక్కు తీర్చుకున్న అన్నా లెజ్నెవా ఈ సందర్భంగా అందరికీ ఆధ్యాత్మికంగా ప్రేరణగా నిలిచారు.
………….