
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి దోహదపడే 24 కీలక అంశాలపై చర్చ జరిపి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం విజయవంతంగా సచివాలయంలో నిర్వహించబడింది.
ఎస్సీ వర్గీకరణపై కీలక ఆమోదం
జాతీయ ఎస్సీ కమిషన్ అందజేసిన నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రివర్గం లోతుగా చర్చించింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభ ఆమోదించిన తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా జాతీయ కమిషన్ స్పందన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
సీఆర్డీఏ మరియు శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం
సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ ఆమోదించింది. అలాగే శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లపై పూర్తిస్థాయిలో చర్చించి, టెండర్లలో ఎల్ వన్‌గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LOA) ఇవ్వాలని నిర్ణయించారు.
అసెంబ్లీ భవనం: రూ.617 కోట్ల వ్యయంతో బేస్మెంట్ + జీ + 3 అంతస్థులు, వ్యూయింగ్ ప్లాట్‌ఫాం, పనోరమిక్ వ్యూ కలిగి ఉండే ఈ నిర్మాణం 11.22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో, 250 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
హైకోర్టు భవనం: రూ.786 కోట్ల వ్యయంతో బేస్మెంట్ + జీ + 7 అంతస్తుల్లో నిర్మించే ఈ భవనం 20.32 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో, 55 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
పెట్టుబడులు – ఉద్యోగావకాశాలు
సీఎం నేతృత్వంలోని పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) 5వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో భాగంగా 16 కంపెనీలకు అనుమతులు ఇచ్చి, సుమారు రూ.30,667 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు తెలియజేశారు. ఈ ద్వారా సుమారు 32,133 ఉద్యోగాలు వచ్చే అవకాశముందని అంచనా.
వాతావరణ మార్పులపై ప్రత్యేక కేంద్రం
రాష్ట్రంలో వాతావరణ మార్పులను పర్యవేక్షించేందుకు స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ అనే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది.
…………..