ఎవరూ ఊహించని విధంగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది అఫ్ఘానిస్థాన్. తాము ఆస్ట్రేలియాపై గెలుస్తామని కనీసం అఫ్ఘాన్ వారు అసలు కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు ప్రపంచమంతా అష్ఘాన్ క్రికెటర్ల సత్తా గురించి కోడై కూస్తోంది. అఫ్ఘాన్ ఈరోజు ఈ స్థాయికి చేరుకుందంటే ఓ రకంగా మనం కూడా ఓ కారణమే. అదేలాగంటే… 2015లో గ్రేటర్ నోయిడాలో ఉన్న షహీద్ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను BCCI అఫ్ఘానిస్థాన్ టీంకు కేటాయించింది. దీనిని అఫ్ఘాన్ తాత్కాలిక హోం గ్రౌండ్‌గా వాడుకుంది. భారత్ మద్దతుతో డెహ్రాడూన్‌లో అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించింది. అఫ్ఘాన్ టీంకు కోచ్‌లుగా BCCI లాల్‌చంద్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజాలను నియమించింది. వీరి నేతృత్వంలో అఫ్ఘాన్ క్రికెటర్లు బాగా రాటుదేలారు. నైపుణ్యాలు ప్లానింగ్ బాగా నేర్చుకోగలిగారు. అఫ్ఘాన్ ఆటగాళ్లు తమ సత్తాను చాటుకునేందుకు IPL ఓ వేదికగా నిలిచింది. వారి సత్తా ప్రపంచానికి తెలియాలని భారత్ వారికి IPLలో అవకాశం కల్పించింది. IPLలో ఆడటం వల్ల వారి సాలరీలు పెరగడంతో పాటు ఆటలో కొత్త నైపుణ్యాలను పుణికి పుచ్చుకున్నారు. అలా BCCI పుణ్యమా అని అఫ్ఘానిస్థాన్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తాను చాటుకుంటోంది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com