
విల్లివాకం న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు ప్రొఫెసర్ సీఎం కే రెడ్డి కోరారు. చెన్నైలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆదివారం ఏఐటిఎఫ్ తరఫున పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి స్మారక భవనం బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అలాగే నెల్లూరు జిల్లాకు పెట్టిన ఎస్పీఎస్ఆర్ జిల్లా పేరు కాకుండా శ్రీరాములు జిల్లాగా నామకరణం చేయాలన్నారు. తమిళనాడులో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని తెలుగు వారికి అటువంటి అవకాశం లేదన్నారు. ప్రభుత్వం తెలుగు అకాడమీ, ప్రాచీన తెలుగు సంస్థ, తెలుగు యూనివర్సిటీలు ఉన్నాయని, ప్రభుత్వ గుర్తింపు లభిస్తే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రిని కలవలేమని, ఇందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో నందగోపాల్, నారాయణ గుప్తా టామ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి ఇస్రాయిల్, ట్రిప్లికేన్ రామ్ నగర్ టామ్స్ నిర్వాహకులు పాల్ కొండయ్య, మహావీర కట్ట బొమ్మన్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఇళయ కట్ట బొమ్మన్ తదితరులు పాల్గొన్నారు.