
విల్లివాకం న్యూస్: చెన్నై, మైలాపూర్ లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ‘ఉగాది పురస్కార గ్రహీతలు గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ లకు అభినందన సభ’ శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఎం.వి నారాయణ గుప్తా, డాక్టర్ విస్తాలి శంకరరావు పాల్గొన్నారు. ముందుగా ప్రార్ధన గీతాన్ని వసుంధరా దేవి ఆలపించారు. నారాయణ గుప్తా స్వాగతోపన్యాసం చేశారు. అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షోపన్యాసంలో ఇరువురు సాహితీవేత్తల సేవలను గుర్తించి ఆంధ్ర ప్రభుత్వం సత్కరించడం ముదావహం అన్నారు. స్మారక భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. జెకె రెడ్డి మాట్లాడుతూ చెన్నైలోని ఇద్దరు సాహితీవేత్తలు ఉగాది పురస్కారాలు అందుకోవడం శుభ పరిణామమని, భవిష్యత్తులో మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి భువనచంద్ర మాట్లాడుతూ ఈ అభినందన సభ నిజమైన ఉగాది లాంటిదని, ఈ సాహితీ మూర్తుల విశిష్టత గొప్పదని అన్నారు. ఇందులో బి. తిరుమల స్వాతి రచించిన ‘మాడభూషి కవిత్వానుశీలన’ పుస్తకావిష్కరణ జరిగింది.
అనంతరం గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ లను భువనచంద్ర ప్రశంసా పత్రం, అనిల్ కుమార్ రెడ్డి తలా రూ.10 వేల నగదు పురస్కారం, నూతన వస్త్రాలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ఇరువురు తమ స్పందన తెలియజేశారు. గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తన ‘జీవన రేఖలు’ రచనను ఆంధ్ర ప్రభుత్వం పరిశీలించి ఈ పురస్కారాన్ని అందజేసిందన్నారు. మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ చెన్నైతో అనుబంధం తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది అన్నారు. ఎం.ఆర్ సుబ్రహ్మణ్యం బృందంచే ‘గానలహరి’ సాంస్కృతిక కార్యక్రమం అలరించింది. విస్తాలి శంకరరావు సభా నిర్వహణ చేపట్టారు. కమిటీ సభ్యులు డాక్టర్ ఏవి శివకుమారి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని తెలుగు ప్రముఖులు, సాహితీవేత్తలు పలువురు పాల్గొన్నారు.
……….