పూర్తిగా దగ్ధం అయిన ఆరికార్డులు
అసెంబ్లీలో సవిూక్షించిన సిఎం చంద్రబాబు
వెటంనే విచారణకు ఆదేశం
సంఘటనా స్థలానికి డిజిపి, సిఐడి చీఫ్
ఉద్యోగి గౌతమ్‌పై అనుమానాలతో అరెస్ట్
అన్నమయ్య జిల్లా మదనప్లలె సబ్ కలెక్టరేట్లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. సిఎం ఆదేశాలతో డీజీపీ, సీఐడీ చీఫ్ మదనప్లలెకు బయలుదేరారు. అగ్నిప్రమాదంలో కీలక దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం. నూతన సబ్‌కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదమా? కుట్రపూరితమా? అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగులబెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి మదనప్లలె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో విలువైన రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయం సిబ్బంది విషయం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక కేంద్రం పక్కనే ఉండటంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ మంటల్లో విలువైన రెవెన్యూ రికార్డులు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కార్యాలయంలో పనిచేసే గౌతమ్ అనే ఉద్యోగి కార్యాలయంలో రాత్రి 12 గంటల వరకు ఉన్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మదనప్లలె సబ్ కలెక్టరేట్లో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే సవిూక్ష నిర్వహించారు. తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. సవిూక్షకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్హా,
సీఎంవో అధికారులు హాజరయ్యారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రాత్రి 11.24 గంటలకు ప్రమాదం జరిగినట్లు ఆయనకు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై సీఎం ఆరా తీశారు.ఆదివారం అర్ధరాత్రి వరకు కార్యాలయంలో గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయం వరకు ఉద్యోగి ఉండటానికి కారణాలు తెలుసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఉద్యోగి ఎందుకు వెళ్లాడు.. ఏ పని కోసం వెళ్లాడు? అనే వివరాలను అడిగారు. ఘటన జరిగిన సమయంలో విధుల్లో గౌతమ్ ఉన్నాడని అధికారులు వివరించారు. ఘటనాస్థలికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఏం విచారణ చేశారని సీఎం ప్రశ్నించారు. ఫోరెన్సిక్, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యంపై నిలదీశారు. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అక్కడ సంచరించిన వ్యక్తుల వివరాలు సేకరించాలన్నారు. నేరాలు చేసి సాక్ష్యాల చెరిపేతలో ఆరితేరినోళ్లు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన ఈ తరహా ఘటనలను అధికారులు మరిచిపోకూడదన్నారు. సాక్ష్యాల చెరిపివేత కోణంపై లోతుగా దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఘటనపై సమగ్ర వివరాలు తన ముందుంచాలన్నారు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com