Logo
Date of Publish : 30 June 2026, 1:33 pm
Editor : CH. MUKUNDARAO

తూర్పు కనుమల పులుల సంరక్షణకు కీలక ముందడుగు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పవన్ కళ్యాణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌ను మంగళవారం ముంబైలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా తూర్పు కనుమలలో పులుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వన్యప్రాణుల నిర్వహణ వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రెండు ఆడ పులులను అందించేందుకు అంగీకరించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతిస్తూ, మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య తగ్గిపోవడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో కొత్త ఆడ పులుల ప్రవేశం ద్వారా జన్యు వైవిధ్యం పెరిగి, అంతరసంతానోత్పత్తి (ఇన్‌బ్రీడింగ్) సమస్యలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆడ పులుల చేరికతో తూర్పు కనుమలలో పులుల జనాభా దీర్ఘకాలికంగా స్థిరపడటమే కాకుండా, ఆరోగ్యకరమైన వన్యప్రాణి ఆవాస వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ చర్య తూర్పు కనుమల పులుల సంరక్షణ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

అలాగే, శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు ఎంతో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్‌కు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.

.............


All Rights Reserved By telugunewstimes
Print Save