
హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను ఐక్యరాజ్యసమితి మద్దతుతో కొనసాగుతున్న ప్రత్యేక సముద్ర భద్రతా కార్యక్రమం తాత్కాలికంగా నిలిపివేసింది. ఒమన్ తీరానికి సమీపంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు బ్రిటిష్ సైన్యం వెల్లడించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ సముద్రయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన నౌకలను హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితంగా తరలించే ప్రణాళికను భద్రతా పరిస్థితులు పూర్తిగా సమీక్షించే వరకు నిలిపివేశారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్న నౌకలకు పూర్తి భద్రతా హామీలు లభించిన తర్వాతే కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, టెహ్రాన్ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధి మార్గాన్ని ఉపయోగించవద్దని ఇరాన్ ఇటీవల హెచ్చరించింది. అనంతరం జరిగిన డ్రోన్ దాడికి ఇరాన్ ప్రమేయం ఉందని ఒక అమెరికా అధికారి పేర్కొన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, దాడికి గురైన నౌక తరలింపు ఆపరేషన్‌లో భాగం కాదని అంతర్జాతీయ సముద్రయాన సంస్థ స్పష్టం చేసింది.
మరోవైపు, ఇరాన్‌కు చెందిన ‘పర్షియన్ స్ట్రెయిట్ అథారిటీ’ నిర్ణీత మార్గాలకు వెలుపల ప్రయాణించే నౌకలకు భద్రతా హామీ ఉండదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా హెచ్చరించింది. ఈ పరిణామాలతో హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.