
విల్లివాకం న్యూస్: మాతృభాషతో పాటు ఇతర భాషలు కూడా నేర్చుకుని గౌరవించాలని జనని సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ నిర్మల పళనివేల్ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) నిర్వహణలో ఉచిత తెలుగు తరగతులు పూర్తి అయిన సందర్భంగా శనివారం ప్రశంసా పత్రాలు అందజేసే కార్యక్రమం చెన్నై టి.నగర్ లో ఉన్న సమాఖ్య కార్యక్రమంలో ఘనంగా జరిగింది. సమాఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిర్మల పళనివేల్ పాల్గొని తెలుగు భాషను రాయటం, చదవటం శ్రద్ధగా నేర్చుకున్న చిన్నారుల నుంచి 74 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రశంసా పత్రాలను అందజేసి సమాఖ్య నిర్వహకులతో కలసి అభినందించారు. ప్రత్యేకించి తెలుగు భాషపై ఇచ్చిన టి.నగర్ కేసరి మహోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మోహన్ ను జ్ఞాపికతో సత్కరించారు.
ఈ సందర్భంగా నిర్మల పళనివేల్ మాట్లాడుతూ ఆయా భాషల సంస్కృతి, సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయని అయినప్పటికీ అవి ప్రజల్లో ఐక్యతను పెంపొందింప చేస్తాయని అన్నారు. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గోటేటి వెంకటేశ్వర రావు, సభ్యులు పాల్గొన్నారు.
……………….