
విల్లివాకం న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ ఆధ్వర్యంలో సాహితీవేత్తల జయంత్యుత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ‘సాహిత్యకారుల జీవనచిత్రాలు’లో భాగంగా ‘సామాజిక చైతన్య స్ఫూర్తి పద్మభూషణ్ బోయిభీమన్న పుట్టినరోజు వేడుకలు గురువారం మధ్యాహ్నం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగుశాఖ అతిథి ఉపన్యాసకులు డా. మాదా శంకరబాబు స్వాగతం పలికారు. తెలుగుశాఖ విద్యార్థినులు ఆలపించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి అధ్యక్షత వహించిన ఆచార్య విస్తాలి శంకరరావు బోయి భీమన్న తల్లిదండ్రులు బోయి నాగమ్మ, పుల్లయ్య, దంపతులకు తూర్పుగోదావరి జిల్లా, మామిడికుదురు అనే గ్రామంలో జన్మించారని, వారి ఐదుగురు సంతానికి పంచపాండవుల్లాగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని పేరు పెట్టారని, వీరిలోని భీమన్నే నేటి మన కవి బోయి భీమన్న అన్నారు. పేరుకు తగ్గట్టే వీరి జీవితం ఆత్మవిశ్వాసంతోనూ, ఆశయాలతోనూ ముందుకు సాగిందని తెలియజేశారు. సమాజంలోని అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం వారి కలం నుంచి అనేక కవిత్వ బాణాలను సంధించిన గొప్ప కవి. సాధారణ పాలేరు కుటుంబలో పుట్టి పద్మభూషణ్ స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి డా. బోయి భీమన్న అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. టి.ఆర్.ఎస్. శర్మ, భీమన్న సాహిత్యాన్ని వివరిస్తూ సామాజిక చైతన్యానికి అవసరమైన సాహిత్యాన్ని సృష్టించి, అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా ముందుకు సాగిన వ్యక్తి బోయి భీమన్న అన్నారు. భీమన్న లాగే ఎస్.ఆర్. శంకరన్ లాంటి వారు సమాజం కోసం పాటుపడ్డారని తెలియజేశారు. చివరగా పిల్లి శతకం రచనా విశేషాల విశిష్టతను పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన గుడిమెట్ల చెన్నయ్య, కవి గొప్పతనాన్ని తెలియజేస్తూ భీమన్న ఆలోచనలు, ఆరాటం, తపన అంతా సమాజ మార్పు కోసమే… భీమన్న కలాన్ని గళంగా మార్చి విశేష సాహిత్య సంపదను సృష్టించారన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు అతిథి అధ్యాపకులు డా. పాండురంగం కాళియప్ప పద్మభూషణ్ బోయి భీమన్న జీవితం, సాహిత్యంపై ఉపన్యసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని నవనవోన్మేషంగా తేజోవంతం చేసిన ఆధునిక సామాజిక దార్శనికుడు మహాకవి బోయిభీమన్న. తల్లి రక్తం బిడ్డలో ప్రవహించినంత సహజంగా బతుకు తత్వం రచనల్లో అనివార్యంగా ప్రతిఫలిస్తుంది. సామాజిక దుర్నీతిని ఖండించిన కవి, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి అద్భుతమైన సాహిత్య సృష్టితో సామాజిక చైతన్యాన్ని ఆశించి జాతిని జాగృతం చేసిన సామాజిక దార్శనికులు మహాకవి బోయి భీమన్న అన్నారు. భీమన్న వ్యక్తిత్వం, సాహిత్యం విశిష్టం. సామాజిక ప్రయోజనాన్ని ఆశించి జాతి సమైక్యతే ధ్వేయంగా ముందుకుసాగి 84 ఏళ్ళు పాటు శ్రమించి దాదాపు 70కి పైగా గ్రంథాలను రాసి తనకంటూ సాహిత్య చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న మహెున్నతమైన వ్యక్తి. మహాకవిగా, సాహితీ వసంతగా, నవయుగ కవిసార్వభౌమునిగా, పద్మభూషణ్ గా అనేక బిరుదులు అందుకోవడమే కాక అనేక సత్కారాలు, సన్మానాలు పొంది పలుపురి చేత ప్రశంసలు అందుకున్న బోయి భీమన్న సాహిత్యం ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. వీరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని శ్రీమతి బోయి హైమావతి పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయి భీమన్న రచన చేశారని, ఆ రచన ద్వారా భీమన్నగారి వ్యక్తిత్వం వారి సామాజిక దృష్టి ఎలాంటిదో తెలుస్తుంది.
సాధారణంగా గొప్పగొప్ప మహాకవులుగా కీర్తించబడినవారు ఎన్ని రచనలు చేసిన ఆ కవి పేరు చెప్పిన వెంటనే ఎదో ఒకటి, రెండు రచనల పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కాని బోయి భీమన్న రచనల పేర్లు భీమన్న పేరుకంటే మరింత ఆదరణపొందాయి. ముఖ్యంగా భీమన్న గారి పేరు చెబితే వెంటనే గుర్తుకువచ్చే రచనలు పాలేరు, జానపదుని జాబులు, పడిపోతున్న అడ్డుగోడలు, రాగవాసిష్టం, త్రిపదులు, శ్రీపిల్లి శతకం, గుడిసెలు కాలిపోతున్నాయి. అంబేద్కర్ సుప్రభాతం, కులనిర్మూలన ఇలా ఎన్నో రచనలు పాఠకుల మనసులో స్ఫురణకు వచ్చి సామాజిక చైతన్య స్ఫూర్తిని కలిగించడమే కాక ప్రతి రచనను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దిన వైనం పాఠకులను ఆలోచింపజేసేవిగా ఉంటాయి అన్నారు. చివరగా ఎస్. శశికళ వందన సమర్పణ చేశారు. బోయి భీమన్న జయంతి వేడుకలలో మిఠాయిలను పంచుకుని భీమన్నకు పుష్పాలతో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆచార్య ఎల్.బి. శంకరరావు దంపతులు, రాజధాని కళాశాల తెలుగుశాఖాధ్యక్షులు డా. ఎలిజబెత్ జయకుమారి, రాణిమేరి కళాశాల అధ్యాపకులు డా. జి. దయామణి, స్వరూప, ఆధ్యాత్మికవేత్త నాగేశ్వరరావు, తెలుగుశాఖ ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి. విద్యార్థులు మరియు తెలుగుభాషాభిమానులు పాల్గొన్నారు.
…………………