
బహుభాషావేత్త-టి.ఆర్.సుబ్రహ్మణ్య శర్మ
చెన్నై న్యూస్ :మద్రాసు మహానగరంలో తెలుగుభాషా సాహిత్యాల వికాసానికి తోడ్పడిన సాహితీవేత్తలలో టి.ఆర్.సుబ్రహ్మణ్యశర్మ ఒకరు. వీరు ఆంధ్ర, ఆంగ్ల, తమిళభాషలలో అసమాన భాషా పాండిత్యం గల పండితులు.ముచ్చటయిన మూడు భాషలలో రచనలు చేయగల సమర్థులు. వీరిని సాంఘిక సంక్షేమ అధికారిగా, కవిగా,రచయితగా, పెరంబూరు తెలుగు సాహితీ సమితి వ్యవస్థాపకకార్యదర్శిగా,అనువాదకునిగా,ఆధ్మాత్మికవేత్తగా,సామాజిక కార్యకర్తగా, మానవతమూర్తిగా, బహుభాషావేత్తగా ప్రసిద్ధులు. ముందుగా టి.ఆర్.ఎస్.శర్మగారిజీవిత ప్రస్థానంలోని విశేషాలను చూద్దాం.వీరి పూర్తి పేరు ‘ తిన్నానేరి రంగస్వామి సుబ్రహ్మణ్యశర్మ’. వీరు టి.ఆర్.ఎస్. శర్మగా సాహిత్య లోకంలోసుపరిచితులు. వీరి మాతృభాష తమిళం. వీరు శ్రీమతి అన్నపూర్ణ అమ్మాళ్, శ్రీ టి.ఎస్.రంగస్వామి అయ్యర్ దంపతులకు 16 వ సంతానంగా ఆగష్టు 6, 1932 న తమిళనాడులోని మధురైలో జన్మించారు. వీరు
ఆంధ్రప్రదేశ్లోని రాజంపేటలో ఉన్నత పాఠశాల విద్యను, కడపలో ఇంటర్మీడియట్ (ఎం.పి.సి), ఆర్ట్స్
కళాశాలలో బి.ఏ (గణితం) చదివారు. శర్మగారు 1962 లో ఆగస్టు 20 న టి.ఎస్. అర్జునయ్యరు కనిష్ఠ
కుమార్తె అలివేలు అనే సరోజ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగురు సంతానం. వీరు చిత్తూరుజిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసి 1990 ఆగష్టు 31 వ పదవి విరమణ పొందారు. వీరి
తమిళం మాతృభాష అయినా తెలుగు భాషపై అభిమానంతో తెలుగులో మంచి పట్టు సాధించి తెలుగు
సాహితీ లోకంలోకి ప్రవేశించి మూడు భాషలలో 54 రచనలు చేశారు. వీరి రచనలను పరిశీలిస్తే తెలుగులో
36, తమిళంలో 14, ఆంగ్లంలో 4 రచనలు చేశారు. అవి తెలుగు రచనలు: భావరాగం, రాగఝరి,
రాగరంజని, గూఢార్థకథలు, కవితాకల్లోలిని, సర్వం శ్రీవాసుదేవమయం, శ్రీకృష్ణ కర్ణామృతము, శ్రీ సూక్తులు,
శ్రీ కృష్ణ రసాయనము మొదలయినవి. అలాగే తమిళ రచనలు: గాయత్రి మంత్రం పొరుల్, అరుల్మిగు అణై
యోగమయిన మహిమై, గీతాసారం, గీతగోవిందం, అరవళి నానూరు, తిరుప్పావై, నారదభక్తి సూత్రంగళ్,
శిరిడిసాయి సహస్రనామ స్తోత్రనామావళి, శివనే దేవాదిదేవణ్, నీల మోహన అష్టకమ్, గాయత్రీ దివ్య శక్తి,
ఆదిత్య హృదయ స్తోత్రమ్ మొదలయినవి. ఆంగ్ల రచనలు: 1. The first book of Aplogues, 2. The Second book of Apologues, 3. Collection of Quotes, 4. Excerpts from Evidence Act. గా చెప్పవచ్చు. టి. ఆర్. ఎస్. శర్మగారి సాహిత్య ప్రస్థానంలో కొన్ని రచనలను గురించి సంక్షిప్తంగా చూద్దాం.
టి.ఆర్.ఎస్.శర్మ సాహిత్యప్రస్థానం ప్రారంభం అయింది తన 50 వ ఏట. వీరి తొలి రచన ‘ భావరాగం’
(1982), ఈ రచనను తెనాలిలోని సంస్కృతాంధ్ర పండితులైన దర్శనాచార్య కొండూరు వీరఘవాచార్యులు
ఆవిష్కరించారు. ఆధునిక కవిత్య విచారణకు మంచి ఉదాహరణ ‘ శ్రీ లక్ష్మీ ప్రియ’ గారి భావ వీచకల కవితాసంపుటిభావరాగం. ‘ శ్రీ కృష్ణ రసాయనము’ అనే రచన 54 కవితల సంపుటి. మనిషికి ధన దాహం, స్త్రీ దాహం పతానానికిమూలమని, అందుకు కృష్ణ చింతనమే దివ్యామృతమని ‘ శ్రీ కృష్ణ రసాయనము’ రచన ద్వారా సమాజానికితెలియజేశారు శర్మగారు. ఈ రచన గురించి పెద్దలు, విద్యాన్ ఎస్. దశరథ రామరెడ్డి గారు ‘ శ్రీ కృష్ణ రసాయనము’లోని ప్రతి శీర్షిక ఒక అమృత కలశం అని ఈ రచన సాహితీ సరోవరం అనడంలో అతిశయోక్తి లేదు అనిచెబూతూ ఎంతో కొనియాడదగిన ఈ మహత్తర రచన సాహితీ దర్పణముని పేర్కొన్నారు. గీతోపదేశ సారాన్ని ప్రతిబింబింప జేసే విధంగా సాగిన ఈ రచన కృష్ణ భక్తి భావ నిర్భరం, ఆధ్యాత్మిక చింతనా ప్రేరకం. సర్వదాఅనుసరణీయం, విశ్వకళ్యాణ కారకం అని డాక్టర్ శ్రీమతి నిర్మలా పళనివేలుగారు తెలిపారు.టి.ఆర్.ఎస్.శర్మ గారు ‘ ఏకం స్వాదు నభుంజీత’ అన్న ఆర్యోక్తి ననుసరించి ఈ శ్రీ సూక్తులు రచననుపాఠకలోకానికి అందించారు. ‘ శ్రీ సూక్తులు’ రచనను అకారది క్రమంలో (అ నుండి క్ష వరకు) రాశారు.దీనిని శర్మగారు ఆంగ్లంలోకి ‘ Collection of Quotes’ పేరుతో అనువదించారు. ఈ రచన మొత్తం ఇరవై పేజీలు. మొత్తం సూక్తులు 325.టి.ఆర్.ఎస్.శర్మ గారి ‘ శ్రీ సూక్తులు’ రచన కూడా మానవ జీవిత అవసరానికి,విజ్ఞాన వికాసానికి, నియమబద్ధతకు, సృజనాత్మకతకు పెంపుదలకు ఎంతగానో తోడ్పడతాయి. సూక్తులుఅమృతభాండాలు వాటిని అవగహన చేసుకుని ఆచరణకు పూనుకొన్నపుడు మానవ జీవితం ధన్యమౌతుంది. ‘ జ్ఞానదీపికలు నగ్నసత్యాలు’ రచనలలో గేయాలు సమాజంలోని వ్యక్తుల లోటుపాట్లును విశ్లేషిస్తూఅందమైన ఉపమానాలతో వివరించారు ఈ రచనను రెండు భాగాలుగా రాశారు. మొదటి భాగం జ్ఞాన
దీపికలు, రెండవ భాగం నగ్నసత్యాలు. జ్ఞానదీపకలులోని గేయాలు నేటి యువతకు కరదీపకలు చెప్పవచ్చు.
నగ్నసత్యాలు ప్రతి వ్యక్తి జీవితంలో తెలుసుకోవలసిన ముత్యాలను ఏర్చికూర్చిన ముత్యాలదండ. ఈ రచన
అలతి అలతి పదాలతో తేటతెల్లమైన తెలుగుభాషలో సాగిన రచన ఇది. ఈ రచన శర్మ గారి వయస్సుకు,
అనుభవానికి, ఆలోచనలకు ప్రతిరూపంగా చెప్పవచ్చు.
వీరి రచనలలో తలమానికమైనది ‘ సర్వం శ్రీవాసుదేవ మయం’ కవితాసంపుటి. ఇందులో 36 గేయ
కవితలు కలవు. మనిషి పుట్టినప్పటి నుండి గిట్టె వరకు ఏది సాధించినా, ఏమి పోందినా అది ‘ సర్వం
శ్రీవాసుదేవమయం’ అన్న విషయాన్ని వ్యక్తికరించారు. ఇందులోని ప్రతి కవితకు శర్మగారు ఆధ్యాత్మికతను
జోడించి ఆధునిక సమాజానికి, మానవుని జీవన గమనానికి ఉపయోగపడే అనేక విషయాలను ఇందులో
తెలియజేశారు. ‘ ఈశావాస్యమిదంజగత్ సర్వం’ అన్న ఉపనిషత్తు వాక్యానికి సమానార్ధకం ఈ రచన,
సామాజిక సమస్యలు, రాజకీయ చతురంగం, ఆధ్మాత్మికత అన్నీ కలగలుపుగా వచ్చిన కవితా సంకలనమే ‘ గందరగోళం’. ఇందులో 60 శీర్షికలు కలవు.
‘ ఆమె’ గేయ కవితాసంపుటిలో ఇరవై ఏడు కవితలు గలవు. ఈ రచన నేటి కాలపు దంపతులకు
దిక్సూచిగా పేర్కొనవచ్చు. అలాగే వైవాహిక బంధంలో ఉన్న దంపతులకు చక్కని సందేశాన్ని అందిస్తాయి ఆమె
గేయ సంపుటిలోని కవితలు, ‘ నలుగురు భక్తులు-నాలుగు నైవేద్యాలు’ రచనలో మొత్తం 25 మంది భక్తుల చరిత్రలను సంక్షిప్తంగాపొందుపరిచారు. శర్మగారు ఈ రచన రెండు భాగాలుగా రాశారు. ఈ రచన మొత్తం 36 పేజీలు. ఇందులోనికథలన్నియు సులభశైలిలో చదువుకొనుటకు సరళమగు రీతిలో మనస్సును ఆకట్టుకొనే విధంగా రాశారు. ఈకథలు భక్తి యొక్క వైశిష్ట్యమును వెల్లడించును. పిల్లలలో దైవభక్తిని, నైతిక ప్రవర్తనను అలవరచుకోనుటకుదోహదం చేయుటకు ఎంతో ఉపయోగపడతాయి.మనిషి ఏ విధంగా బతికితే తనకు సమాజానికి మేలు జరుగుతుందో తెలియజేసే కవితాల్లో ‘ కవితాకల్లోలిని’.ఈ గేయ కవితాసంపుటి భావి రచయితలకు మార్గదర్శకంగా నిలుస్తుంది.
శ్రీ కృష్ణ కర్ణామృతము, తిరుమూలర్ అనే రచనలు టి.ఆర్.ఎస్. శర్మగార అనువాద కావ్యరచనలలో
విశిష్టమైనదిగా చెప్పవచ్చు.అదీ-ఇదీ అనే రచన ఆధ్యాత్మిక విషయ సంకలనం. ఇందులో 12 సంక్షిప్త ఆధ్యాత్మిక వ్యాసాలుకలవు. నాలాయిర దివ్య ప్రబంధ కథలు అనే రచనలో 108 దివ్య దేశాల సంక్షిప్త పర్యాటక సమాచారములను కలిగి ఉంది. గుడార్థ కథలు (బాలనీతి కథల సంకలనం), నారదభక్తి సూత్రలు, భగవద్గీత ఉపనిషద్భింధవ్యం,దివ్యకథావాహిని మొదలయిన ఆధ్మాత్మిక రచనలు ఉన్నత సమచారాలు అందించే సమూహారాలుగా చెప్పవచ్చు.టి.ఆర్.ఎస్.శర్మ ప్రత్యేకత గురించి చెప్పలంటే సూక్తులు, జాతీయాలు, సామెతలు, పలుకుబళ్లు మొదలైనవాటిని ఉపయోగించి కవిత్వ రచన గావించి తెలుగు భాషకు వన్నె తెచ్చిన భాషావేత్త టి.ఆర్.ఎస్.శర్మ. వీరిరచనా వైభవానికి, వైదుష్యానికి వారి రచనలే తార్కాణాలు. ఆణిముత్యాలవంటి వారి రచనలలో వారిభాషాభిమానమే కాక, సమాజంపై వారికి గల నిశిత పరిశీలన, జీవిత అనుభవసారం సమాజాన్ని ప్రక్షాళంనచేయాలనే దృక్పథం మున్నగు అంశాలు అడుగడుగునా ప్రస్ఫుటమవుతున్నాయి. వీరి రచలన్ని ఆధ్యాత్మికపరమైనవి. అవి భక్తిని పెంపొందించే రీతిలో ఉంటాయి. అలాగే వీరు చాలా సులభమైన పదాలను ఉపయోగిస్తూ,అందరికి అర్థమయ్యే రీతిలో రచనలు చేయుట వీరి ప్రత్యేకత, అలాగే ఆధ్యాత్మికతకు సామాజికతను జోడించిమానవ జీవినానికి అవసరమైన అనేక విషయాలను సులభశైలిలో వ్యక్తీకరించడం వీరి రచనాశైలిగా చెప్పవచ్చు. ఇకవీరు పెరంబూరు తెలుగు సాహితీ సంస్థ కార్యదర్శిగా ప్రతి నెల మూడవ ఆదివారం సాయంత్రం నాలుగుగంటలకు సాహితీవేత్తలపై మద్రాసు నగరంలో ని విశిష్ట తెలుగు ఆచార్యులతో, సాహిత్య రంగంలోని ప్రముఖులతోసాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానికాంశాలపైన నూరు ప్రసంగ ఉపన్యాసాలను పెరంబూరు ‘ ధర్మమూర్తి
రావు బహద్దూర్ కలవల కన్నన్ శ్రేష్ఠి మహోన్నత పాఠశాల’ ఆవరణలో ఇప్పించారు. 2014 లో మొదటి
సమావేశంలో తొలి మహిళాఅవధాని శ్రీమతి మడకసిర కృష్ణప్రభావతి అష్టావధాన కార్యక్రమం నాల్వర్
కళ్యాణమండపంలో ఘనంగా జరిగింది. ‘ నిండుకుండ తొణకదు’ అన్నట్లు వీరు నిగర్వి, నిరాడంబరంగా
ఉంటూ, అందరిని చిరునవ్వుతో పలకరిస్తుంటారు. వయస్సు మళ్లినా అత్యాధునిక భావాలు కల్గిన సాహితీ
తపస్వి శర్మగారు. అభ్యాసంతో మనుషులు గొప్పవాళ్ళు అవుతారని తెల్పిన తాత్వికులు శ్రీ శర్మగారు.
శర్మ గారు తొమ్మిది పదుల వయసుగల వీరు చెన్నైలో ఎన్నో ఏళ్ళుగా తెలుగుతల్లికి ఎనలేని సేవ
చేస్తున్నారు. వీరి సాహిత్య సేవలకు గాను తమిళనాడు హింది అకాడమి వారు ‘ నాగరాజ సమ్మాన్’ బిరుదును,
టి.టి.సి.ఎ వారి సాహితీ సాంఘిక సేవా పురస్కారము, మైసూరు వర్చువల్ విశ్వవిద్యాలయం వారు గౌరవ
డాక్టరేటును అందిచారు. అలాగే శ్రీశ్రీశ్రీ పరమహంస భరధ్వాజ స్వామి వారిచే ‘ ధర్మప్రచార జ్ఞాన భాస్కర’
బిరుదును, తిరువాన్మియూరు హిందీ హృదయ వారిచే ‘ భద్ర సాహిత్య శిరోమణి’ బిరుదును, తమిళనాడు
తెలుగు సాంస్కృతిక సంఘం వారిచే ‘ ఉద్ధవశ్రీ’ బిరుదును, పెరంబూరు కల్విక జగం వారిచే ‘ కణ్ణన్ సీర్
పరవువార్’ అనే బిరుదులను అందుకున్నారు.
(మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖలో 2024 ఆగస్టు 29 న తెలుగుభాషా దినోత్సవం
పురస్కరించుకొని ‘ టి.ఆర్.ఎస్. శర్మ సాహిత్యం-అవలోకనం అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తూన్నసందర్భంగా రాసిన ప్రత్యేక వ్యాసం)
డాక్టర్ మాదా శంకరబాబు,
వ్యాస రచయిత, గెస్ట్ లెక్చరర్,
తెలుగుశాఖ, మద్రాసువిశ్వవిద్యాలయం,
33-05, 7200685477